‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి విజయవాడ వచ్చిన రామ్ గోపాల్ వర్మ, చిత్ర బృందాన్ని పోలీసులు నగరంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. వర్మ ఏర్పాటు చేయబోయే ప్రెస్ మీట్ వల్ల రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వర్మ ట్విట్టర్ ద్వారా వరుస వీడియోలు పోస్ట్ చేశారు. పోలీసుల తీరును తప్పుబడుతూ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటూ మండిపడ్డారు. విజయవాడలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించాలనుకున్న ప్రెస్ మీట్ పెట్టలేక పోతున్నందుకు అభిమానులకు, ప్రజలకు సారీ చెప్పారు.

మమ్మల్ని పోలీసులు విజయవాడ రాకుండా ఎయిర్ పోర్టులోనే నిర్భంధించారు. మేము అసలు సిటీలోకి రాకూడదు, ఎక్కడా ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు, ప్రెస్‌తో కూడా మాట్లాడటానికి వీల్లేదు అంటూ ఆంక్షలు పెట్టినట్లు ఆర్జీవీ తెలిపారు.

మమ్మల్ని ఆంధ్రపదేశ్ నుంచి తరిమేయాలని ఆదేశాలు ఇచ్చారు. మరి దీని వెనక ఎవరు ఉన్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి వాటిని ఊరికే వదిలేస్తే ఈ డెమొక్రటిక్ కంట్రీ డిక్టేటర్ కంట్రీ అవుతుంది అంటూ వర్మ తన ఆగ్రహాన్ని వెలుబుచ్చారు.

నిర్మాత రాకేష్ రెడ్డి పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. మేమే టెర్రరిస్టులమా? దొంగలమా? ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మా సినిమా కోసం ప్రెస్ మీట్ పెట్టుకోవడం నేరమా అంటూ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

No votes yet.
Please wait...