తెలంగాణ‌లో రెండోసారి ఆన్‌లైన్ ద్వారా నిర్వ‌హిస్తున్న ఎంసెట్ ప‌రీక్ష‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శుక్రవారం నుంచి ఎంసెట్‌ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇవాళ , రేపు, ఈ నెల 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా వంద ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తెలంగాణ‌తో పాటు ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు మొత్తం 2ల‌క్ష‌ల‌ 17వేల 199 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. ఇందులో రెండింటికీ హాజరయ్యే వారు 235 మంది ఉన్నారు. విద్యార్థులను పరీక్ష సమయాని కంటే గంటన్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామంటున్నారు అధికారులు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థులు చివరి క్షణంలో ఇబ్బందులు పడకుండా వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు అత్యధికంగా బాలికలే దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ కోసం బాలురు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు బాలికలు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష రాసేందుకు 87వేల 804 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా, 54వేల 410 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు బాలురు 23వేల‌316 మంది దరఖాస్తు చేసుకోగా, బాలికలు 51వేల 664 మంది దరఖాస్తు చేసుకున్నారు.

No votes yet.
Please wait...