భర్త, అత్తమామల వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో వెలుగుచూసింది. అత్తారింట్లో వేధింపులు భరించలేక ముంబైలోని మేనమామ ఇంటికెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది జువ్వండి శ్రీలత అనే మహిళ. ఈమెకు 2011లో రామంతాపూర్‌కు చెందిన వంశీరావుతో వివాహం జరిగింది. ఈ సమయంలో కోటి రూపాయల నగదు, కిలో బంగారం కట్నం రూపంలో ఇచ్చారు. 2012లో శ్రీలతను యూకే తీసుకెళ్లాడు భర్త. అప్పటి నుంచి వరకట్న వేధింపులు ప్రారంభించాడు వంశీరావు. దీంతో మళ్లీ కోటి రూపాయలు ఇచ్చారు బాధితురాలి కుటుంబ సభ్యులు.

శ్రీలత గర్భిణిగా ఉన్నప్పుడు వంశీరావు తన తల్లిని యూకే తీసుకెళ్లాడు. అక్కడ వరకట్న వేధింపులు తీవ్రమయ్యాయి. ఈ సమయంలోనే శ్రీలత పాపకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని మానసిక వేదనకు గురి చేశారు. దీంతో 2018 జూన్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించింది శ్రీలత. అదే ఏడాది తన భర్త, పాపతో కలిసి రామంతాపూర్‌ వచ్చింది. అయితే.. భార్య, కూతుర్ని వదిలి యూకే వెళ్లిపోయాడు వంశీరావు. అత్తారింట్లో అత్తమామల వేధింపులు ఎక్కువ కావడంతో ముంబైలోని మేనమామ ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది శ్రీలత. ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలత బంధువులు.. మృతదేహాన్ని రామంతాపూర్ తీసుకొచ్చి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగారు.

శ్రీలత పడుతున్న ఇబ్బందులు చూసి తాళలేక.. గతంలో ఆమె తల్లి చంద్రకళ తనువు చాలించిందని బంధువులు తెలిపారు. ప్రస్తుతం శ్రీలత అత్తమామలు ఆశాలత, రాజేశ్వరరావు పరారీలో ఉన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు మృతురాలి బంధువులు.

No votes yet.
Please wait...