హాయిగా అడవిలో విహరిస్తూ.. నచ్చిన పండు తింటూ.. కిల కిల రావాలతో రోజంతా గడిపేస్తుంటే.. నా రెక్కలు విరిచేసి.. నన్ను పంజరంలో బంధించారు. ఆనక మాటలు కూడా నేర్పించారు. పండో ఫలమో పెడుతున్నారు కదా అని ఆ విశ్వాసంతో వాళ్లు చెప్పినట్లు విన్నాను… నేర్పించిన మాటలు పలికాను. అంత మాత్రానికే నన్ను అరెస్టు చేస్తానంటే ఎలా సారూ.. జోస్యం చెప్పుకునే ఓ చిలుకను జైల్లో పెట్టారు బ్రెజిల్ పోలీసులు.. ఎందుకలా అని ఆరాతీస్తే.. స్మగ్లింగ్ ముఠాను పట్టుకోవాలని పోలీసులు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎన్ని వ్యూహాలు రచించినా అవి బెడిసి కొడుతున్నాయి. ఈసారి ఎలాగైనా వారిని పట్టుకుని తీరాల్సిందే అని పక్కాగా ప్లాన్ వేశారు. నిందితులు ఓ ఇంట్లో పెద్ద ఎత్తున కొకైన్ సరఫరా చేస్తున్నారని సమాచారం అందుకున్నారు. అక్కడికి పోలీసులు భారీ బలగంతో చేరుకున్నారు.

లోపల గుట్టు చప్పుడు కాకుండా పని కానిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు వచ్చిన విషయం తెలియదు. కానీ పంజరంలో ఉన్న చిలుక మాత్రం పోలీసుల రాకను పసిగట్టింది. వెంటనే తన యజమానులను అలర్ట్ చేసింది. ‘మమ్మా.. పోలీస్’ అని అరిచింది. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు మరో మార్గం ద్వారా అక్కడినుంచి పారిపోయారు. లోపలకు వచ్చిన పోలీసులకు నిరాశే మిగిలింది. అక్కడ ఒక్కరూ లేరు. అందరూ జంప్. పంజరంలోని చిలుకే ఇంత పని చేసిందని పోలీసులు నిర్దారించుకున్నారు. దాంతో.. పద పోలీస్ స్టేషన్‌కి అని దాన్ని పట్టుకుపోయారు. స్టేషన్‌కి వెళ్లిన తరువాత మాత్రం కిక్కురుమనకుండా కూర్చుందట చిలుక. విషయం తెలుసుకున్న పక్షి ప్రేమికులు మాత్రం చిలుకని అరెస్ట్ చేయడం ఏవిటండీ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దాన్ని వదిలి పెట్టండి అంటూ డిమాండ్ చేశారు. పోలీసులు చేసేదేం లేక చిలుకని జంతుప్రదర్శనశాలకు అప్పగించారు.

ఇన్ని రోజులు పంజరంలో ఉన్న చిలుక ఎగరడం మర్చిపోయిందట. అందుకే ఎగరడానికి మూడు నెలల శిక్షణ ఇచ్చి అప్పుడు వదిలేస్తారట. బ్రెజిల్‌లో డ్రగ్స్ సరఫరాదారులు జంతువులను ఉపయోగించుకోవడం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. కానీ ఓ చిలుక సాయంతో స్మగ్లర్లు పోలీసులకు మస్కా కొట్టడం మాత్రం ఇదే మొదటిసారి అని అధికారులు తెలియజేస్తున్నారు. 2010లో కొలంబియాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పోలీసులు ఓ ఇంటి మీద రైడ్ చేయడంతో రన్.. రన్ అంటూ సంకేతాలిచ్చి వారంతా తప్పించుకునేలా చేసింది ఓ చిలుక.

No votes yet.
Please wait...