తెలంగాణ ఇంటర్ సంక్షోభం ఇప్పుడప్పుడే తీరిపొయ్యేలా లేదు. ‘జవాబు పత్రాలే గల్లంతయ్యాయా’ అనే అనుమానం తల్లిందండ్రుల్లో వేళ్లూనుకుంటోంది. ఉచితంగా రీవాల్యుయేషన్ కి అనుమతిస్తే.. లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారని, ఇన్ని పేపర్లు మళ్ళీ రుద్దాలంటే నెలరోజులు పైనే పడుతుందని.. సమస్యను తెలివిగా సర్దేసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈలోగా ఎంసెట్.. మిగతా పోటీ పరీక్షల తేదీలు కూడా ముంచుకొస్తుంటే.. ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ క్రమంలోనే ఇంటర్ గొడవపై అన్ని వర్గాలూ స్పందిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున విజయశాంతి గొంతు పెంచి మాట్లాడుతున్నారు. హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నా నిర్వహించిన విజయశాంతి కేసీఆర్ టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. 16 మంది పిల్లలు చనిపోయిన తర్వాత మత్తు వదిలి తీరిగ్గా బైటికొచ్చారంటూ ఆమె విమర్శించారు. ఇంటర్మీడియట్ అంశంపై సమీక్ష చేయాలన్న ధ్యాస మీకు ఐదురోజుల తర్వాత కలిగిందా అని సూటిగా ప్రశ్నించారు.

అటు.. ఇటీవలే వైసీపీలో చేరిన మంచు మోహన్ బాబు మాత్రం.. తెలంగాణ సర్కార్ పట్ల ఉదాసీన వైఖరితో కూడిన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘ప్రభుత్వం స్పందించింది.. దోషుల్ని శిక్షిస్తుంది’ అంటూ భరోసా ఇచ్చిన మోహన్ బాబు.. ‘ఒక విద్యాసంస్థల అధినేతగా..పిల్లల మనసెరిగిన మనిషిగా చెబుతున్నా..ఎవ్వరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దు..’ అని పిలుపునిచ్చారు. ఇంత రొచ్చుకూ మూలకారణమైన తెలంగాణ సర్కార్‌ని మాత్రం ఆయన పల్లెత్తు మాట అనలేకపోయారు. పైగా.. ‘స్పందించింది’ అంటూ వత్తాసు పలకడంపై విమర్శలొస్తున్నాయి.

గట్టిగా నిలదీసే అలవాటున్న గొంతులు కూడా ఇలా ‘ మూగబోవడం’ ఏమిటంటూ ప్రశ్నలు పడిపోతున్నాయి. ‘ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిల కోసమే ప్రభుత్వాన్ని బూతులు తిడుతూ పిల్లల్నేసుకుని ఎర్రటి ఎండలో ధర్నాలు చేసిన మోహన్ బాబు.. ఇప్పుడు విద్యార్థుల ప్రాణాలు తీసిన ప్రభుత్వ నిర్లక్ష్యం మీద ఎందుకు దీటుగా స్పందించరు.. అన్నది ఒక బరువైన సందేహమే!

No votes yet.
Please wait...