యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ బావిలో ఇంకెన్ని మృతదేహాలు ఉన్నాయో… శుక్రవారం వెలుగుచూసిన శ్రావణి హత్య ఉదంతం తరువాత, మనీషా అనే యువతి అదే బావిలో హత్యకు గురై ఎముకలు మాత్రమే మిగిలిన స్థితిలో కనిపించిన విషయం తీవ్ర కలకలం రేపింది. ఈ రెండు హత్యలనూ హాజీపూర్ లోనే ఉండే శ్రీనివాస్ రెడ్డి అనే సైకో చేసినట్టు పోలీసులు తేల్చారు. శ్రీనివాస్ రెడ్డిని విచారించి, సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు.

పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, డ్రగ్స్‌ కు అలవాటు పడిన శ్రీనివాస్‌ రెడ్డిపై గతంలోనూ అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయి. ఒంటరిగా ఉన్న మహిళలు, బాలికలే ఇతని టార్గెట్. హాజీపూర్‌ వెళ్లడానికి ఎదురుచూసే వారిని తన వాహనంపై ఎక్కించుకుని, బావి వద్దకు తెచ్చి హత్యలకు పాల్పడుతుంటాడు.

తొలుత వారిని బావిలోకి బలవంతంగా తోసేవాడు. బావిలో పడ్డ వారు ఎముకలు విరిగి కొనవూపిరితో ఉంటే, వారిపై అత్యాచారం చేసి, హత్య చేసేవాడు. అదే బావిలో పూడ్చి పెట్టేవాడు. ఇటీవలే మైసిరెడ్డిపల్లి ప్రాంతంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన శ్రీనివాస్ రెడ్డిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. మూడు సంవత్సరాల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయి, తిరిగి ఏడాది క్రితం వచ్చాడు. గత వారంలో శ్రావణి హత్యోదంతం వెలుగులోకి వచ్చిన తరువాత ఆమె మృతదేహాన్ని బావిలోంచి తీస్తున్నప్పుడు, అక్కడున్న ప్రజల్లో శ్రీనివాస్‌ రెడ్డి కూడా ఉన్నాడు.

ఇక ఈ రెండు హత్యలతో పాటు గతంలో మైసిరెడ్డి పల్లిలో కనిపించకుండా పోయిన కల్పన అనే బాలిక వెనుక కూడా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇదే బావిలో మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు బావిలో తవ్వకాలు జరపాలని భావిస్తున్నారు.

No votes yet.
Please wait...