కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది… క్రమ క్రమంగా కేసీఆర్ కల నేరవేరుతోంది. మొదటి మోటార్‌ వెట్‌ రన్‌ సక్సెస్‌ అవగా… గురువారం రెండో మోటార్‌ వెట్‌ రన్‌ను విజయవంతంగా ప్రారంభించింది… ప్రస్తుతం సర్జ్‌పూల్‌లో 141.75 మీటర్ల మేరు నీరు ఉండగా, డ్రాఫ్ట్‌ట్యూబ్‌ ద్వారా 3,200 క్యూసెక్కుల నీటిని రెండో మోటారులోకి పంపి పరీక్షలు నిర్వహించారు అధికారులు.

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. ఇప్పటికే నంది మేడారం పంప్‌హౌస్‌లో మొదటి మోటార్‌ వెట్‌ రన్‌ విజయవంతం అవగా, గురువారం రెండో మోటార్‌ వెట్‌ రన్‌ను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ ప్రారంభించారు. రెండో మోటారు వెట్ రన్ ప్రారంభం కంటే ముందు ప్రత్యేక పూజలు చేశారు. మోటార్ ను ప్రారంభించిన స్మితా సబర్వాల్.. డెలివరీ సిస్టర్న్‌ను పరిశీలించారు……

నందిమేడారం పంపుహౌస్‌లో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఏడు మోటర్లను అమర్చాల్సి ఉండగా.. ఇప్పటివరకు నాలుగు డ్రైరన్‌లు పూర్తయ్యాయి. మరో రెండింటిపై వర్క్ చేస్తున్నారు. 3200 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఈ మోటర్ ద్వారా రెండుసార్లు చేపట్టిన పరీక్షలతో 0.01 టీఎంసీల గోదావరి జలాలను 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేసి సిస్టర్న్‌లోకి విడుదల చేస్తారు. ఆపై ఆ జలాలు మేడారం రిజర్వాయర్‌లోకి వెళ్తాయి.

ప్రస్తుతం సర్జ్‌పూల్‌లో 141.75 మీటర్ల మేరు నీరు ఉండగా, డ్రాఫ్ట్‌ట్యూబ్‌ ద్వారా 3,200 క్యూసెక్కుల నీటిని రెండవ మోటారులోకి పంపి పరీక్షలు నిర్వహించారు అధికారులు. మొదటి మోటార్‌ వెట్‌ రన్‌ మాదిరిగానే దీన్ని కూడా రెండుసార్లు అరగంట చొప్పున పరీక్షించనున్నారు. నంది మేడారం పంప్‌హౌస్‌లో రెండు రోజుల్లో రెండు మోటర్లను మూడు గంటలపాటు నడిపారు. మూడు గంటలపాటు నడిచిన మోటర్లకు సంబంధించి మొత్తం 0.345 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. అంటే 3,45,000 యూనిట్లు విద్యుత్ వినియోగం అయింది. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు రూ.5.80 చొప్పున లెక్క వేస్తే రూ.20,01,000 లక్షల విలువ గల విద్యుత్ వినియోగమైనట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ తెలిపారు.

నందిమేడారం అండర్‌టన్నెల్‌లోని మోటర్‌కు వెట్ రన్ నిర్వహించే విషయంలో ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఇంజినీర్లు.. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రక్రియను పకడ్బందీ జాగ్రత్తలతో నిర్వహించారు. ఎల్లంపల్లి జలాశయం నుంచి హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిని వదిలింది మొదలు.. 1.1 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాల్వ, సుమారు 9.534 కిలోమీటర్ల మేర నిర్మించిన జంట సొరంగాలు దాటుకుంటూ గోదావరి జలాలు సర్జ్‌పూల్‌లోకి చేరాయి. ఎప్పటికప్పుడు లీకేజీలపై లోతైన పరిశీలన జరిపారు. ఇందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను వినియోగించారు. ఇలాంటి పరీక్షల్లో సాంకేతిక సమస్యలు సర్వసాధారణం. కానీ తాజా ప్రక్రియలో చిన్న అవాంతరం కూడా ఎదురుకాకపోవడం విశేషం. ఈ పరిణామం ఎండనక, వాననక రేయింబవళ్లు శ్రమిస్తున్న ఇంజినీర్లకు కొండంత ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చింది.

No votes yet.
Please wait...