ప‌వ‌న్ క‌ల్యాణ్ పొలిటిక‌ల్ పార్టీ జ‌న‌సేన‌కు ఇప్పుడు గుర్తుల గోల ఇబ్బంది పెట్టేసేలానే ఉంది. పార్టీ పెట్టిన ఐదేళ్ల త‌ర్వాత ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన జ‌న‌సేన‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసును ఎన్నిక‌ల సింబ‌ల్ గా ఖ‌రారు చేసింది. ఇటీవ‌ల ముగిసిన ఏపీ ఎన్నిక‌ల్లో అదే గుర్తుతో ఆ పార్టీ అభ్య‌ర్థులు పోటీ చేశారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీ బాగానే ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లింది. ఏపీలో ఎన్నిక‌లు ముగియ‌గానే… తెలంగాణ‌లో షెడ్యూల్ జారీ అయిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు జ‌న‌సేన రెడీ అయిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆ పార్టీకి ఏఏ గుర్తులు ఇవ్వాల‌న్న యోచ‌న చేసిన ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును అలాగే ఉంచేసి… ఇంకో కొత్త గుర్తును కూడా కేటాయించింది. ఆ గుర్తు ఏమిటంటే… క్రికెట్ బ్యాట్.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్పుడు తెలంగాణ‌లో జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌తో పాటు ఎంపీటీసీ స్థానాల‌కు కూడా ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. రెండు ఎన్నిక‌లు ఒకేసారి జ‌రిగినా… వేర్వేరు బ్యాలెట్ పేప‌ర్లే వినియోగిస్తారు. ఈవీఎంలు పెట్టినా… వేర్వేరు ఈవీఎంల‌నే వినియోగిస్తారు. మ‌రి… జ‌న‌సేన‌కు రెండు గుర్తుల‌ను ఎందుకు కేటాయించార‌న్నది ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తోంది. సాధార‌ణంగా పార్టీ గుర్తుల‌పైనే జరిగే ఈ ఎన్నిక‌ల్లో ఆయా పార్టీల‌కు ఒకే సింబ‌ల్ ను కేటాయిస్తుంటారు.

అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు జ‌న‌సేన‌కు రెండు గుర్తులు రావ‌డంపై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాల‌ను ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేని నేప‌థ్యంలో… త‌న‌కు కేటాయించిన గుర్తుల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు జ‌న‌సేన అప్పుడే ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి రెండు గుర్తులు కేటాయించార‌ని, ఇందులో ఇప్ప‌టికే త‌మ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసును జ‌డ్పీటీసీ అభ్య‌ర్థుల‌కు, కొత్త‌గా కేటాయించిన  క్రికెట్ బ్యాట్ గుర్తు ఎంపీటీసీ అభ్య‌ర్థుల‌కు ఉంటుంంద‌ని… ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది.

No votes yet.
Please wait...