తెలంగాణ ఇంటర్‌ ఫలితాలపై రేగిన దుమారంపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఏం తేల్చింది… బోర్డు తప్పిదాలను బయటపెట్టిందా… గ్లోబరీనా సంస్థపై ఎలాంటి వ్యాఖ్యలు చేసింది… సాంకేతిక కారణాలను సాకుగా చూపించిందా… ప్రభుత్వానికి సమర్పించనున్న త్రిసభ్య కమిటీ నివేదికలు ఏం ఉంది… ఇంటర్‌ బోర్డ్‌ తాజాగా తీసుకున్న చర్యలేమిటి… వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ సిద్ధం చేసింది. ప్రభుత్వానికి కమిటీ తన నివేదిక అందించనుంది. ఇంటర్‌ బోర్డ్‌, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్‌ తప్పిదాలను.. గ్లోబరినా సంస్థ తప్పిదాలను కమిటీ గుర్తించింది. ఇంటర్ బోర్డ్‌ క్రాస్‌ చెక్‌ చేయకుండా ఫలితాలను విడుదల చేసిందని త్రిసభ్య కమిటీ తేల్చింది. గ్లోబరినా సంస్థకు ఉన్న అర్హతలపై లోతుగా అధ్యయనం చేసింది. రాబోయే 15 రోజుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో రిపోర్ట్‌లో పొందుపరిచినట్టు సమాచారం…

ఇంటర్ ఫలితాల అవకతవకలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది… టీఎస్ పీఎస్సీ ఎండీ వెంకటేశ్వర్ రావు, ప్రొఫెసర్‌ నిశాంక్, ప్రొఫెసర్‌ వాసన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మూడు రోజులుగా సుదీర్ఘంగా గ్లోబరీనా సీఈవో రాజు, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్, ఓఎస్ డీతోపాటు ఇతర ఉన్నతాధికారులను ప్రశ్నించింది. అనంతరం నివేదికను పూర్తి చేసింది.

గ్లోబరీనా టెక్నాలజీ సంస్థ ఉపయోగించిన సాఫ్ట్‌ వేర్‌ లోనే లోపాలు ఉన్నట్టు కమిటి గుర్తించింది. ఈ సాఫ్ట్‌ వేర్‌ ను మార్చకపోతే రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ చేసినా ప్రయోజనం ఉండదని, మళ్లీ అదే రీతిలో మార్కులు, తప్పులు తడకలుగా వస్తాయని త్రిసభ్య కమిటీ సభ్యులు భావిస్తున్నారు. సంస్థ అనేక తప్పిదాలు చేసినట్లుగా రిపోర్టులో రాసినట్టు తెలుస్తోంది. ఇంటర్ బోర్డ్‌ క్రాస్‌ చెక్‌ చేయకుండా ఫలితాలను విడుదల చేయడం సరికాదని తన రిపోర్టులో అభిప్రాయపడినట్లు సమాచారం…

మరోవైపు ఇంటర్ ఫలితాల అవకతవకలతో చెలరేగుతున్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను పునః పరిశీలిస్తామని బోర్డు పేర్కొంది. రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌నెట్‌ కేంద్రాల వద్ద క్యూలో నిల్చోవాల్సిన అవసరంలేదని బోర్డు తెలిపింది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి వస్తాయని పేర్కొంది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌కు డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. ముందు జాగ్రత్త కోసం ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

No votes yet.
Please wait...