తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు కారణమై ఏకంగా 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరీనా సంస్థ చరిత్రేమిటి? దాని ట్రాక్‌ రికార్డ్‌ అంతా మోసాలేనా? అవును గ్లోబరీనా చేసిన మోసాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లోనే కాదు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఈ సంస్థ చేసిన మోసాలు తెరపైకి వచ్చాయి.

గ్లోబరీనా సంస్థ కాకినాడలో పురుడు పోసుకుంది. జేఎన్‌టీయూ అధికారులే దీనికి పాలు పోసి పెంచారు. జేఎన్‌టీయూ విద్యార్థులకు స్టడీ మేటీరియల్‌ సరఫరా, పేపర్‌ వాల్యూయేషన్‌ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న గ్లోబరీనా.. 2011 నుంచి 2014 వరకు దాదాపు 120 కోట్ల వరకు జేఎన్‌టీయూకు పంగనామాలు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా గ్లోబరీనాకు కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారు అధికారులు.

ప్రశ్నాపత్రాల లీకేజ్‌, వాల్యూయేషన్‌లో తప్పులతడకలు, స్టడీ మేటీరియల్‌లో అవకతవకలకు పాల్పడిన గ్లోబరీనా.. అక్కడి విద్యార్థుల ఆగ్రహానికి గురైంది. గ్లోబరీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. స్టూడెంట్స్‌ ఆందోళనలతో దిగొచ్చిన వర్సిటీ అధికారులు.. చివరకు గ్లోబరీనా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. కానీ అప్పటికే వర్సిటీ అధికారులను మభ్యపెట్టి 120 కోట్లు కొల్లగొట్టింది గ్లోబరీనా సంస్థ.

గ్లోబరీనా అక్రమాలపై గవర్నర్‌ నరసింహన్‌ కూడా విచారణ కమిటీని నియమించారు. సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో గ్లోబరీనాపై వర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో.. 3 నెలల క్రితం ఆ సంస్థపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఎన్నికల హడావుడితో ఆ కేసు ఎఫ్‌ఐఆర్‌కే పరిమితమైంది. ఇక తమ ఆటలు ఆంధ్రాలో సాగడం లేదని భావించిన గ్లోబరీనా.. తన అడ్డాను తెలంగాణకు మార్చుకుంది. అంతటితో ఆగని ఈ సంస్థ ఇక్కడ కూడా మోసాలకు తెరలేపింది. గ్లోబరీనా చేసి అక్రమాలతో ఇప్పుడు తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

No votes yet.
Please wait...