ప్రకాశం జిల్లాలో ప్రేమ జంటలే లక్ష్యంగా కొన్ని ముఠాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. ఇంట్లో తెలియకుండా రహస్యంగా కలుసుకోవడానికి వచ్చిన జంటలను టార్గెట్ చేస్తున్నాయి. ఒంగోలు మండలంతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. జంటలపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, వారి దగ్గర నుంచి దొరికినంత డబ్బులు, నగలు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా, ఫిర్యాదు చేసేందుకు ప్రేమికులు వెనుకాడుతున్నారు. కుటుంబం పరువు పోతోందని, ప్రియుడితో వెళ్లామని తెలిస్తే తల్లిదండ్రులు దండిస్తారనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. మరోవైపు విషయం తెలిసినా, లిఖిత పూర్వక ఫిర్యాదులు రాకపోవడంతో పోలీసులు కూడా వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా ఒంగోలు సమీపంలో ఓ ముఠా ఓ జంటపై దాడి చేసింది. నాగులుప్పలపాడు మండలానికి చెందిన ఇద్దరు పేర్నమిట్ట-మంగమూరు రోడ్డులోని ఓ జామాయిల్ తోటలో కలుసుకున్నారు. దీన్ని గమనించిన ముఠా వారిపై దాడిచేసింది. యువకుడిని బెల్టుతో తీవ్రంగా కొట్టారు. తర్వాత అతని వద్ద నగదు దోచుకున్నారు. బెల్టుతో అతని కాళ్లు చేతులు కట్టేసి, మహిళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని దోచుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే… కట్లు విప్పుకున్న యువకుడు దగ్గరలోని మంగమూరు గ్రామంలోకి పరిగెత్తి, తమను రక్షించాల్సిందిగా గ్రామస్థులను కోరాడు. గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఏడాది కిందట ఇలాగే జంటలపై దాడులు జరిగాయి. దీనిపై టీవీ-5 వరుస కథనాలు ప్రసారం చేయడంతో పోలీసులు స్పందించి ఓ ముఠాను పట్టుకున్నారు. దాదాపు 18 మంది మహిళలు, యువతులపై సామూహిక అత్యాచారం చేసినట్టు వారు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. గతంలో దురాగతాలకు పాల్పడిన ముఠా జైల్లో ఉండగా తిరిగి అదే తరహా ఉదంతాలు వెలుగు చూస్తుండంతో శివారు ప్రాంతాలకు వెళ్ళాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.

తాజాగా వెలుగు చూసిన ఉదంతంలో దాడికి గురైన యువకుడు, మహిళ ఇద్దరూ వివాహితులు కావడంతో విషయం బయటికి తెలిస్తే. తమ కాపురాలు కూలిపోతాయని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితుడిని స్టేషన్‌కి పిలిచి విచారణ జరిపారు. అయితే అతను మొదట నిందితులను గుర్తుపడతానని చెప్పి, తర్వాత తనను వదిలేయమని పోలీసులను ప్రాధేయపడ్డాడు. మరోవైపు నాలుగు నెలల వ్యవధిలో ముగ్గురు ఎస్పీలు మారడంతో పోలీస్ శాఖలో నిర్లిప్తత ఏర్పడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల విధులపై దృష్టిపెట్టి శాంతిభద్రతలను గాలికొదిలేశారన్న ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

పోలీసులు మాత్రం శివారు ప్రాంతాలపై నిఘా పెట్టామని, గతంలో కొందరిని అరెస్ట్ చేశామని చెప్పారు. తాజా ఘటనలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. గతంలో చీమకుర్తి ప్రాంతానికి చెందిన కొందరు ఓ గ్యాంగ్ ఏర్పడి.. నాగార్జున సాగర్ కాలువపై తిరుగుతూ జంటలను బెదిరించి డబ్బులు దోచుకోవడం, అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలు జరిగాయి. దీంతో మంగమూరు ఘటనకు.. ఆ గ్యాంగ్ కి సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No votes yet.
Please wait...